‘కోవిన్’ యాప్‌‌ ద్వారానే టీకా పంపిణీ..!

కరోనా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతి వచ్చిన నేపథ్యంలో.. ఇక వాటి పంపిణీపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. త్వరలో ప్రారంభం కానున్న ఈ వ్యాక్సిన్‌ పంపిణీ ఎన్నికల ప్రక్రియలో ఉండే బూత్‌స్థాయి ఆధారంగా ప్రణాళికను రూపొందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ వెల్లడించారు. ఇందుకోసం నైపుణ్యం కలిగిన సిబ్బందిని అందుబాటులో ఉంచేందుకు భారీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయని తెలిపారు.

కోవిన్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారానే..

అత్యవసర వినియోగం కింద కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ప్రక్రియ ఎలా ఉంటుందనే విషయంపై కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టతనిచ్చింది. వ్యాక్సిన్‌కు తీసుకునే వారు ముందుగా కేంద్ర ఆరోగ్యశాఖ రూపొందించిన ‘కోవిన్‌’‌ ప్లాట్‌ఫామ్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. లబ్దిదారులకు టీకా ఇచ్చే సమయం, ప్రాంతం వంటి వివరాలను ముందుగా అధికారులు అందులో పొందుపరుస్తారు. రెండో డోసుకు సంబంధించి సమాచారం కూడా ఉంటుంది. ఇక వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఏదైనా దుష్ర్పభావాలు ఎదురైతే ఆ యాప్‌ ద్వారా రిపోర్ట్‌ చేయడం లేదా అందులో ఉంటే కాల్‌సెంటర్‌ నెంబర్లకు తెలియజేసే వీలుంటుంది. రెండు డోసులు పూర్తైన తర్వాత ఇ-సర్టిఫికేట్‌ కూడా ఆయాప్‌లోనే పొందవచ్చు.

టీకా కేంద్రాలు ఎలా ఉంటాయంటే.?

  • వేచి ఉండే స్థలము, టీకా ఇచ్చే ప్రదేశం, పరిశీలన గది
  • వంద మందికి టీకా ఇచ్చే ప్రతి ప్రదేశంలో ఐదుగురు సిబ్బంది
  • మరింత మంది లబ్దిదారులుంటే అదనపు సిబ్బంది ఏర్పాటు
  • అలర్జీ వంటి లక్షణాలకు చికిత్స చేసేందుకు ప్రత్యేక కిట్‌

ప్రతి టీకా కేంద్రంలోకి రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారిని మాత్రమే అనుమతిస్తారు. తమ వంతు వచ్చే వరకూ వేచి చూడాలి. అనంతరం వారి రిజిస్ట్రేషన్‌ డెస్క్‌ వద్ద వారి వివరాలను పరిశీలిస్తారు. తర్వాత వారిని వ్యాక్సినేషన్‌ గదిలోకి పంపిస్తారు. అక్కడ వ్యాక్సిన్‌ తీసుకున్నవారు పరిశీలన గది(అబ్జర్వేషన్‌ రూం)లో 30నిమిషాల పాటు వేచి ఉండాలి. అంతలోపు వారికి ఏదైనా అనారోగ్యం లేదా దుష్ప్రభావాలు గుర్తిస్తే వెంటనే వారికి అవసరమైన చికిత్స చేస్తారు. ఎలాంటి సమస్యలు లేనట్లయితే ఇంటికి వెళ్లిపోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This