బోర్లు అడుగంటాయి..నల్లాలు నెమ్మదించాయి

ఎండల ధాటికి భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో బోర్లు అడుగంటాయి. వేసవిలో నీటి అవసరత పెరిగింది. నల్లా నీటినే డ్రమ్ముల్లో పట్టుకొని వాడుకోవాల్సిన పరిస్థితి. నల్లా నీరేమో సన్నగా వస్తోంది. లాక్‌డౌన్‌ తీవ్రంగా ఉన్న సమయంలో వ్యాపార, వాణిజ్య సంస్థలు, పరిశ్రమల నీటి వినియోగం తగ్గిపోవడంతో ఆ మేరకు ప్రజలకు తాగునీటి సరఫరా పెరిగింది. సడలింపుల తర్వాత మళ్లీ నీటి రాక తగ్గి కష్టాలు పెరిగాయని ప్రజలు వాపోతున్నారు.

హైటెక్‌ సిటీ ప్రాంతంలో..

హైటెక్‌ సిటీ ప్రాంతంలోని హరిజన బస్తీ, గుట్టలబేగంపేట, వడ్డెరబస్తీ, సాయినగర్‌, కొండాపూర్‌ శ్రీరాంనగర్‌ కాలనీ బి బ్లాక్‌లో రోజు విడిచి రోజు నీరు వస్తుంది. తక్కువ ఒత్తిడితో పది బిందెలూ నిండటం లేదు. సూరారం రాజీవ్‌ గృహకల్ప సముదాయంలో 3500 కుటుంబాలు ఉంటున్నాయి. వారంలో శనివారం మాత్రమే తక్కువ ఒత్తిడితో నీరిస్తారు. వెంకట్రామ్‌నగర్‌, శివాలయనగర్‌, హనుమాన్‌నగర్‌, సుభాష్‌నగర్‌, సూరారం, గాజులరామారం, పద్మానగర్‌, ఎన్టీఆర్‌నగర్‌, వాజ్‌పేయీనగర్‌, శ్రీరాంనగర్‌ ప్రాంతాల్లోనూ ఇదే తీరు.

నెరవేరని హామీలు

జల్‌పల్లి పురపాలికలోని వీకర్‌ సెక్షన్‌ కాలనీ, శ్రీరామకాలనీ, వాదిహుదా, వాది ఎ హబీబ్‌, న్యూబాబానగర్‌, షాహిన్‌నగర్‌, ఎర్రకుంట బస్తీల్లో నీటి కొరత పరిష్కారానికి ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు నెరవేరలేదు.

చేతులు తడిపితేనే.. గొంతులు తడిసేది

ప్రగతినగర్‌కాలనీ, మారుతీనగర్‌, లక్ష్మీనరసింహనగర్‌, శ్రీకృష్ణానగర్‌లోని కొన్నిచోట్ల నీటి సమస్యను ఆసరాగా చేసుకొన్న లైన్‌మెన్లు డబ్బులిస్తే ఎక్కువ సేపు నీరిస్తామని వసూళ్లకు దిగుతున్నారు.

అర్ధరాత్రి దాటాక ఇస్తే పట్టుకొనేదెలా?

జలమండలి డివిజన్‌-3, ఓల్డ్‌మల్లేపల్లి సెక్షన్‌ పరిధిలో నీటి విడుదలలో సమయపాలన లోపించింది. అర్ధరాత్రి దాటాక తక్కువ ఒత్తిడితో ఇస్తున్నారు. ఆసిఫ్‌నగర్‌, దాయిబాగ్‌, దాయిబాగ్‌ వెంకటేశ్వరాలయం బస్తీ, శంకర్‌నగర్‌, జగదాంబనగర్‌, రవీంద్రనగర్‌(కొంతమేర) ప్రాంతాల్లో రాత్రి 11 గంటల తర్వాత నీరు ఇస్తారు. గంటలోపే బంద్‌ చేస్తున్నారు. ఎలా పట్టుకోవాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This