నగరాల్లో కబ్జాల వరద- మాయమవుతున్న జలవనరులు

మన దేశంలోని నగరాలు, పట్టణాలు వానాకాలం రాగానే నిలువునా మునుగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో సంభవిస్తున్న వరదలు పెద్ద ముప్పుగా మారాయి. ఇవి కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు పెను సవాలు విసురుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలు మొదలు చెన్నై, ముంబయి, హైదరాబాద్‌ వంటి నగరాలన్నీ వరద నీటి దెబ్బకు అల్లాడిపోతున్నవే. సమస్యకు ప్రధాన కారణాల్లో పట్టణీకరణ ఒకటి. 1991లో దేశంలో సుమారు 3,768 పట్టణాలు ఉండగా, 2011 నాటికి 7,935కు చేరింది. వచ్చే ఏడాదికల్లా వాటి సంఖ్య 10 వేలకు చేరనున్నట్లు తెలుస్తోంది. 2050 నాటికి దేశ జనాభాలో సగం పట్టణాల్లోనే స్ధిరపడతారని అంచనా. దేశంలోని నగరాలు, పట్టణాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నా… అవి ప్రణాళికాబద్ధంగా లేవనేందుకు వాటిని ముంచెత్తుతున్న వరదలే నిదర్శనం. సామర్థ్యానికి తగిన వరద కాలువలు ఏ నగరంలోనూ సరిగా ఉండటం లేదు. ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు నగరాల్లో వరదలు వచ్చినప్పుడు తాత్కాలిక పరిష్కార మార్గాలతో దాటేస్తూ, సమస్యకు శాస్త్రీయమైన, శాశ్వత పరిష్కారాల్ని గుర్తించడంలో విఫలమవుతున్నాయి.

ఏటా అపార నష్టం

ఏటా సంభవించే వివిధ రకాల విపత్తులతో దేశంలో సుమారు రూ.70వేల కోట్లదాకా నష్టం వాటిల్లుతుండగా, అందులో వరదల వల్ల జరుగుతున్న ఆర్థిక నష్టమే రూ.51వేల కోట్లని అంచనా. అపార ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది. గత దశాబ్దకాలాన్ని పరిశీలిస్తే దిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌తో సహా తాజాగా వరంగల్‌, కాకినాడ వరకు ఎన్నో నగరాలు వరదల దెబ్బకు అతలాకుతలమయ్యాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులతో రెండు నెలల వ్యవధిలో కురవాల్సిన వానలు ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా అయిదారు రోజుల వ్యవధిలో విరుచుకుపడటం పట్టణాల్లో వరదలు పోటెత్తడానికి ఒక కారణం. వీటివల్ల జనజీవనం స్తంభించిపోతోంది. రోడ్డు, రైలు, వాయు మార్గాల్లో రవాణా నిలిచిపోతోంది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు కనీసం తలదాచుకునే పరిస్థితి లేక పునరావాస కేంద్రాలకు వెళ్లడం కొన్ని నగరాల్లో సర్వ సాధారణమైంది. పట్టణ ప్రాంతాల్లో తీవ్రస్థాయి వరదలకు మూల కారణాలను గుర్తించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This