‘ఉద్రిక్తతలు పెంచేందుకే చైనా క్షిపణి ప్రయోగాలు’

దక్షిణ చైనా సముద్రంలో చైనా మరింత దుందుడుకు వైఖరి ప్రదర్శిస్తోంది. సైనిక విన్యాసాల్లో భాగంగా ఈ ప్రాంతంలో డ్రాగన్​ దేశం నాలుగు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు అమెరికా తెలిపింది. చైనా చర్యలతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా పెరుగుతాయని పేర్కొంది.

ఆగస్టు 23 నుంచి 29 వరకు దక్షిణ చైనా సముద్రం పారాసెల్​ ఐల్యాండ్స్​ ప్రాంతంలో సైనిక అభ్యాసాలు నిర్వహిస్తామని చైనా ఇటీవలే ప్రకటించింది. దీనిపై అగ్రరాజ్యం ఆందోళన వ్యక్తం చేస్తోంది. వివాదాస్పద ప్రాంతంలో చైనా చర్యలతో మరింత అస్థిరత్వం నెలకొంటుందని పేర్కొంది.

దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా, శాంతిని నెలకొల్పేందుకు ఈ ప్రాంతంలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించబోమని 2002లో చైనా చేసిన ప్రకటనకు విరుద్ధంగా ప్రస్తుత సైనిక అభ్యాసాలు ఉన్నాయని అమెరికా తెలిపింది.

ఇండో-పసిఫిక్​ ప్రాంతంలో స్వేఛ్చ, శాంతియుత వాతావరణం ఉండాలని అమెరికా కోరుకుంటోందని, చైనా చర్యలు ఇందుకు వ్యతిరేకంగా ఉన్నాయని పెంటగాన్​ పేర్కొంది. దక్షిణ చైనా సముద్రంలో సైనిక మోహరింపులు ఉండకూడదనే ప్రతిజ్ఞకు ఈ చర్యలు పూర్తి విరుద్ధమని స్పష్టం చేసింది. సైనిక మోహరింపులపై చైనాను జులైలోనే అప్రమత్తం చేశామని అమెరికా గుర్తు చేసింది. కానీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని వివరించింది. ఉద్రిక్తతలు మరింత పెంచేందుకే చైనా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని తెలిపింది.

ఇండో-పసిఫిప్ ప్రాంతంలో టాస్క్​ఫోర్స్​ను మోహరించనున్నట్లు ప్రకటించింది అమెరికా. ఈ ప్రాంతంలో ఎలాంటి సంక్షోభాలు తలెత్తినా స్పందించేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This