సీఎం మాట తప్పి మడమ తిప్పారు.. రాజీనామా చేస్తారా..?: చంద్రబాబు

తమకు పదవుల కంటే… ఏకైక రాజధానిగా అమరావతి ఉండటమే ముఖ్యమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటిస్తే… తమ పదవులు వదిలేస్తామని వ్యాఖ్యానించారు. అమరావతిని రాజధానిగా కొనసాగించే అంశంపై వైకాపా నేతలు రాజీనామా చేయమని 48 గంటలు సమయం ఇచ్చానన్న చంద్రబాబు… ఈ పోరాటం తన కోసం కాదు… భవిష్యత్తు తరాల కోసమేనని స్పష్టం చేశారు. న్యాయం రైతుల వైపు ఉంది కాబట్టే కోర్టులోనూ స్టేటస్ కో వచ్చిందని పేర్కొన్నారు.

నాశనం చేస్తారని ఎన్నికల ముందే చెప్పా…

రాజధానికి 30 వేల ఎకరాలు కావాలని అసెంబ్లీలో చెప్పారా.. లేదా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. మీరు చేసే పనులు సరైనవని అనిపిస్తే ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. ప్రజా ప్రయోజనాలు వదిలి నీచ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అన్నీ మరిచిపోయి ఇవాళ మూడు ముక్కలాట ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని నాశనం చేస్తారని ఎన్నికల ముందే చెప్పానన్న చంద్రబాబు… వేలమంది రైతులు రహదారులపై ఆందోళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ధైర్యముంటే ఎన్నికలకు వెళ్దాం.. రండి…

అమరావతిపై మీరు ఎన్నిరకాలుగా మాట్లాడతారని వైకాపా నేతలను చంద్రబాబు ప్రశ్నించారు. ధైర్యముంటే ఎన్నికలకు వెళ్దాం.. రండి అంటూ సవాల్ చేశారు. రైతులతో జరిగిన ఒప్పందాన్ని కాపాడాలన్న చంద్రబాబు… కేంద్రం జోక్యం చేసుకుని రాజధానిని కాపాడాలని కోరారు. వైకాపా, కాంగ్రెస్ నేతలు జగన్‌ను నిలదీయాలన్న చంద్రబాబు… అసత్యాలు చెప్పి ప్రజలను మోసం చేయడం తప్పని పేర్కొన్నారు. అమరావతిపై ఇప్పటికైనా మనసు మార్చుకోవాలని హితవు పలికారు. రాజధానిని మార్చే అధికారం వైకాపాకు లేదని స్పష్టం చేశారు.

ప్రజలే మంచి చెడులు విశ్లేషించాలి

రాజధానిగా అమరావతే ఎందుకు ఉండాలి..? దీని వల్ల లాభాలేంటో వివరిస్తూ పత్రాలు విడుదల చేస్తామని చంద్రబాబు చెప్పారు. వాటిపై ప్రజలను చైతన్యవంతులను చేస్తామన్నారు. ప్రజలు కూడా మంచి చెడులను విశ్లేషించాలని కోరారు. అంతా కలిసి పోరాడి.. అమరావతిని కాపాడుకుందామని విజ్ఞప్తి చేశారు.

రామ మందిరానికి శంకుస్థాపన జరిగిన రీతిలోనే…

రామాలయానికి భూమిపూజ చేయడం శుభకరమని చంద్రబాబు పేర్కొన్నారు. ఇవాళ రామ మందిరానికి శంకుస్థాపన జరిగిన రీతిలోనే అమరావతి శంకుస్థాపన జరిగిందని చంద్రబాబు గుర్తుచేశారు. పార్లమెంటులో మట్టీ, యమునా నది జలాలను తీసుకొచ్చిన ప్రధాని అండగా ఉంటామని అనాడు హామీ ఇచ్చారని చెప్పారు. అమరావతిలో 30 నదుల పుణ్యజలాలతో భూమిపూజ చేశారని గుర్తుచేశారు. అమరావతికి అండగా ఉంటామని శంకుస్థాపన సమయంలో ప్రధాని చెప్పారని వివరించారు.

కనీస అవగాహన లేదు

కరోనా వైరస్​ విషయంలో వైకాపా కార్యకర్తకు ఉన్న అవగాహన కూడా ముఖ్యమంత్రికి లేదు. తుంపర్ల ద్వారా వైరస్​ వ్యాప్తి చెందుతుందని ఆ పార్టీ కార్యకర్త ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తే.. సీఎం మాత్రం పారాసిటమాల్​ తీసుకుంటే తగ్గిపోతుందని చెబుతున్నారు. పోలీసులను ఉపయోగించి పెత్తనం చేయాలనుకుంటున్నారు. తప్పుడు నిర్ణయాలతో ఏడాది, రెండేళ్లలో ప్రభుత్వాలు పడిపోయిన సందర్భాలు చాలా దేశాల్లో ఉన్నాయి. ఎన్నికల్లోనూ చిత్తుచిత్తుగా ఓడిపోయారు.

కనువిప్పు కలగాలనే

సీఎం జగన్​కు కనువిప్పు కలగాలనే.. అసెంబ్లీ సాక్షిగా ఆయన మాటలు, వీడియోలు చూపిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికలకు ముందు.. అధికారంలోకి వచ్చాక ఎప్పుడేం చెప్పారో తెలియజేస్తూ వీడియో ప్రదర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This