‘ఆ దర్శకుడు నన్ను దుస్తులు విప్పమన్నాడు’

బాలీవుడ్‌ దర్శకుడు సాజిద్‌ ఖాన్‌పై ప్రముఖ మోడల్‌ పాలా.. తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన 17 ఏళ్ల వయసులో ఆయన దారుణంగా ప్రవర్తించాడన్నారు. రెండేళ్ల క్రితం భారత్‌లో మీటూ ఉద్యమం సంచలనం సృష్టించింది. ఆ సమయంలో ముగ్గురు మహిళలు సాజిద్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఫలితంగా హౌస్‌ఫుల్‌-4 నిర్మాతలు సాజిద్‌ను ప్రాజెక్టు నుంచి తప్పించి, మరొకర్ని తీసుకున్నారు.

ప్రముఖ మోడల్‌ పాలా మళ్లీ సాజిద్​పై ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. “ప్రజాస్వామ్యం చనిపోవడానికి ముందు, భావాల్ని వ్యక్తపరిచే స్వేచ్ఛను నిషేధించడానికి ముందే.. నాకు జరిగిన ఘోరాన్ని బయటపెట్టాలి అనిపించింది” అంటూ వ్యాఖ్య రాసి.. పోస్ట్‌ చేశారు పాలా.

పోస్టు సారాంశం ఇదే…

“మీటూ ఉద్యమ సమయంలో చాలా మంది అమ్మాయిలు సాజిద్‌ ఖాన్‌ వేధించారని చెప్పారు. కానీ నేను చెప్పే ధైర్యం చేయలేదు. ఎందుకంటే.. గాడ్‌ ఫాదర్‌ (సినీ నేపథ్యాన్ని ఉద్దేశిస్తూ..) లేకుండా చిత్ర పరిశ్రమకు వచ్చిన నటుల్లో నేనూ ఒకదాన్ని. కుటుంబ సభ్యుల్ని పోషించడానికి డబ్బులు సంపాదించాల్సిన బాధ్యత నాపై ఉండటం వల్ల మౌనంగా ఉన్నా. కానీ ఇప్పుడు నా తల్లిదండ్రులు నాతో లేరు. ఒకరిపై ఆధారపడకుండా.. నేనే స్వయంగా సంపాదిస్తున్నా. నా 17 ఏళ్ల వయసులో సాజిద్‌ ఖాన్‌ నన్ను లైంగికంగా వేధించారు అని చెప్పే ధైర్యం నాకు వచ్చింది. ఆయన నాతో చాలా అసహ్యంగా మాట్లాడారు. నన్ను ముట్టుకునేందుకు ప్రయత్నించారు. అంతేకాదు తన సినిమా హౌస్‌ఫుల్‌లో నటించే అవకాశం ఇవ్వాలంటే.. తన ముందు దుస్తులు విప్పాలని అడిగారు. ఆయన ఇంత దారుణంగా ఎంత మంది అమ్మాయిలతో ప్రవర్తించాడో ఆ దేవుడికే తెలియాలి. అందరి సానుభూతి కోసం నేను ఇప్పుడు ఈ విషయం చెప్పడం లేదు. నా చిన్నతంలోనే ఇలాంటి ఘటన ఎదర్కోవడం వల్ల మానసికంగా ఎంత కుంగిపోయానో తెలపడానికి మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను మారాను.. ఇలాంటి క్రూరులు ఊచలు లెక్కబెట్టాలి. కేవలం కాస్టింగ్‌ కౌచ్‌కు మాత్రమే కాదు.. ఇతరుల్ని మభ్యపెట్టి, వారి కలల్ని చిదిమేసినందుకు కూడా ఆయన శిక్ష అనుభవించాలి. కానీ నేను వేధింపుల తర్వాత నా లక్ష్యాన్ని పక్కనపెట్టలేదు. ఆయన నిజస్వరూపాన్ని ఇన్నాళ్లూ బయటపెట్టకపోవడమే నేను చేసిన పెద్ద తప్పు”

— పాలా, మోడల్​

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This