దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు.. ఆరు రౌండ్లు పూర్తి.. తగ్గిన భాజపా ఆధిక్యం

తెలంగాణ.. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తొలి ఆరు రౌండ్లు ముగిసేసరికి భాజపా అభ్యర్థి రఘునందన్​రావు 2,667 ఓట్ల ముందంజలో ఉన్నారు. ఆరో రౌండ్లో తెరాస 353 ఓట్ల ఆధిక్యం కనబరిచింది. ఆరు రౌండ్లు ముగిసేసరికి భాజపా-20,226, తెరాస-17,559, కాంగ్రెస్‌-3,254 ఓట్లు వచ్చాయి. తొలి 5 రౌండ్ల వరకు భాజపా ఆధిపత్యం చెలాయించింది. ఆరో రౌండ్​లో మాత్రం తెరాసకు ఆధిక్యం లభించింది.

23 మంది అభ్యర్థులు పోటీపడిన దుబ్బాకలో విజేత ఎవరో మరికాసేపట్లో స్పష్టం కానుంది. కొవిడ్‌-19 నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెండు హాళ్లలో ఏడేసి చొప్పున 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 5 వీవీ ప్యాట్లలోని స్లిప్పులను కూడా లెక్కిస్తారు. ఈవీఎంలు మొరాయించిన పక్షంలో వీవీ ప్యాట్లలోని స్లిప్పులను పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ నెల 3న జరిగిన పోలింగ్‌లో 1,64,192 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 82.61 శాతం పోలింగ్‌ నమోదైంది.

దుబ్బాక ఉపఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. ప్రధానంగా తెరాస, భాజపా నేతల మధ్య మాటల యుద్ధంతో రాజకీయంగా వేడి రగిలింది. తెరాస నుంచి సోలిపేట సుజాత, భాజపా నుంచి మాధవనేని రఘునందన్‌రావు, కాంగ్రెస్‌ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పోటీకి దిగిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం ఒంటి గంటలోగా ఫలితాల వెల్లడి పూర్తికావచ్చని అధికారులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This