మాపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు: ఈసీ

బిహార్‌ ఎన్నికల ఫలితాల ప్రకటన విషయంలో తమపై ఎలాంటి రాజకీయపరమైన ఒత్తిళ్లు లేవని ఎన్నికల సంఘం(ఈసీ) తెలిపింది. ఫలితాల వెల్లడిలో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆర్జేడీ, కాంగ్రెస్‌ పార్టీలు చేసిన ఆరోపణల్ని ఖండించింది. ఎన్నికల అధికారులు, యంత్రాంగమంతా నిజాయితీగా పనిచేశారని ఈసీ ప్రధాన కార్యదర్శి ఉమేశ్‌ సిన్హా తెలిపారు.

ఎన్నికల అధికారులపై బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌, ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొచ్చి ఫలితాలు వారికి అనుకూలంగా మార్చేశారని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ఆరోపించారు. వాస్తవంగా తమ కూటమి 119 స్థానాల్లో గెలిచిందంటూ మంగళవారం రాత్రి ట్విట్టర్‌లో ఆ జాబితాను పోస్టు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా ఇదే తరహా ఆరోపణలు చేసింది. గెలిచిన తమ కూటమి అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదని ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే ఈసీ స్పందించింది.

19 మంది అభ్యర్థులంతా గెలుస్తున్నట్టు ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌లోనూ పెట్టారని.. గంట వ్యవధిలోనే కనీసం 10 మంది అభ్యర్థులు ఓడినట్టు ప్రకటించారన్న తేజస్వీ ఆరోపణలపై ఉమేశ్‌ సిన్హా వివరణ ఇచ్చారు. క్షేత్రస్థాయి కౌంటింగ్‌ కేంద్రాల్లోని రిటర్నింగ్‌ అధికారుల నుంచి సమాచారం రావడానికి ఆలస్యం అవుతుందని తెలిపారు. దీంతో లెక్కింపు కేంద్రాల వద్ద ఉండే సమాచారానికి వెబసైట్‌లో ఉండే డేటాకు కొంత వ్యత్యాసం ఉండే అవకాశం ఉందన్నారు. దీనివల్లే కొన్ని పార్టీలు పొరబడి ఉంటాయని వివరణ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This