బిహార్​ పోరు: సందిగ్ధంలోనే సీట్ల పంపకం

బిహార్​ ఎన్నికలకు సరిగ్గా నెల రోజులు కూడా సమయం లేదు. మరోవైపు అధికార, ప్రతిపక్ష కూటముల్లో సీట్ల సర్దుబాటు గందరగోళంగా మారింది. ఒక్కొక్కరు సభ్యులు కూటమిని వీడుతున్నా..”మహాగఠబంధన్​”లో అసెంబ్లీ సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఇప్పట్లో కొలిక్కివచ్చే సూచనలు కనిపించడంలేదు. కొత్త పార్టీలు మహాకూటమిలో వచ్చి చేరే పరిస్థితులు లేకపోగా.. పాత మిత్రులు ఎక్కువ సీట్లలో పోటీకి దిగుతామంటూ డిమాండ్​ చేస్తున్న నేపథ్యంలో సీట్ల సర్దుబాటులో సందిగ్ధత నెలకొంది.

గత ఎన్నికల్లో 81 శాసనసభ స్థానాలను కైవసం చేసుకున్న రాష్ట్రీయ జనతాదళ్​(ఆర్జేడీ) మహాకూటమిలో పెద్ద పార్టీ కావడం వల్ల.. మొత్తం 243 స్థానాలకు గానూ కనీసం 150 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో నిలపాలని దృఢ నిశ్చయంతో ఉంది. అయితే.. ఈ విషయంపై అసంతృప్తితో ఉన్న మిగతా పార్టీలకు నచ్చజెప్పడం ఆర్జేడీకి తలనొప్పిగా మారింది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్​ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంపైనా కూటమి సభ్య పార్టీలు పెదవి విరుస్తున్నాయి.

సీపీఐఎమ్​ఎల్​ ఆగ్రహం

ఈ నేపథ్యంలో హిందుస్థానీ ఆవామ్​ మోర్చా(సెక్యులర్​) పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జితన్​ రామ్​ మాంఝీ ఇప్పటికే కూటమిని వీడి ఎన్డీఏ గూటికి చేరారు. మరోవైపు తమకు 75స్థానాలు కేటాయించాలని కాంగ్రెస్​ పట్టుపడుతోంది. ఆర్జేడీ మాత్రం అందుకు సిద్ధంగా లేదు. ఝార్ఖండ్​ ముఖ్యమంత్రి హేమంత్​ సోరెన్​ కూడా తమకు బిహార్​లో పోటీ చేసేందుకు సీట్లు కేటాయించాలని కోరుతూ ఇప్పటికే రాంచీలో లాలూప్రసాద్​ యాదవ్​ను కలిశారు. వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎం, సీపీఐఎమ్​ఎల్​లను కూటమిలోకి తెచ్చేందుకు ఆర్జేడీ ప్రయత్నిస్తోంది. అయితే.. తమకు కావలసిన స్థానాలు ఇచ్చేందుకు ఆర్జేడీ సుముఖంగా లేదని సీపీఐఎమ్​ఎల్​ ఆగ్రహం వ్యక్తంచేసింది. తమ డిమాండ్లను అంగీకరించకపోతే.. ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమని ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This