బిహార్​ బరి: పక్కా వ్యూహంతో ఎన్డీఏ-లాలూ పార్టీకి సవాళ్లెన్నో..

దేశంలోని మరో కీలక రాష్ట్రంలో ఎన్నికల సంగ్రామానికి తెర లేస్తోంది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఏ క్షణాన్నయినా వెలువడే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ప్రధాన పార్టీలన్నీ తమకు అనుకూల పార్టీలను ఒకతాటిపైకి తీసుకురావడం.. ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేయడంలో నిమగ్నమయ్యాయి. తాజా ఎన్నికల్లో ప్రధానంగా రెండు కూటములు కీలకపాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటిలో భాజపాతో కలిసి ముఖ్యమంత్రి, జనతాదళ్‌ యునైటెడ్‌ (జేడీయూ) అధినేత నితీశ్‌ కుమార్‌ కీలకపాత్ర పోషిస్తున్న ఎన్డీయే ఒకటి. దీనికి దీటుగా నిలిచే మరో కూటమి ఏర్పాటుపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

నాడు ఏమైంది?

గత (2015) అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ), జేడీయూ, కాంగ్రెస్‌ పార్టీలు మహాఘట్‌ బంధన్‌ (మహా కూటమి)గా ఏర్పడి బరిలోకి దిగాయి. 243 అసెంబ్లీ స్థానాలకు గాను దాదాపు 180 వరకు దక్కించుకున్నాయి. అత్యధికంగా ఆర్జేడీ 80 సీట్లు సాధించింది. అయితే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన నితీశ్‌ కుమార్‌ రెండేళ్ల తర్వాత మహా కూటమి నుంచి బయటకొచ్చి, భాజపా మద్దతుతో తిరిగి అధికారం చేపట్టారు. ఇలా అత్యధిక స్థానాల్లో విజయం సాధించినా ఆర్జేడీ ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆర్జేడీకి సవాళ్లు..
అత్యధిక స్థానాలను సాధించినా ప్రతిపక్షంలోనే ఉన్న ఆర్జేడీ అనేక సవాళ్ల మధ్య బరిలోకి దిగుతోంది. లాలూప్రసాద్‌ యాదవ్‌కు జైలుశిక్ష పడిన నేపథ్యంలో.. తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలోని ఆ పార్టీకి ఇప్పుడు బలమైన కూటమిని ఏర్పాటు చేయడం పెద్ద సవాలే. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ సంకీర్ణ రాజకీయాలతో చేదు అనుభవాలను ఎదుర్కొన్న ఆర్జేడీ ఒకవేళ స్వతంత్రంగా పోటీ చేసినా నెగ్గుకురావడం సవాలే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This