నవతరం ‘మిస్సమ్మ’ ఈ ‘ఖుషీ’ ముద్దుగుమ్మ

భూమిక చావ్లా.. యువకుడు సినిమాతో తెలుగు యువకుల గుండెల్ని కొల్లగొట్టిన తార. తెరపై కనిపిస్తే చాలు సినీప్రేక్షకులు ఉక్కిరిబిక్కిరైపోయేవారు. అంతలా ప్రేక్షకుల మనస్సుల్లో బలమైన స్థానం సంపాదించుకున్న ఈ అందాల మిస్సమ్మ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకోండి.

భూమిక చావ్లా అసలు పేరు రచనా చావ్లా. వీరిది న్యూదిల్లీలో స్థిరపడిన పంజాబీ కుటుంబం. భూమిక తండ్రి ఆర్మీ ఆఫీసర్‌గా పని చేసేవారు. భూమికకు ఒక అన్నయ్య, ఒక అక్క ఉన్నారు. అక్కడే పాఠశాల విద్యాభ్యాసం చేసిన తరువాత ముంబయికి వీరు మకాం మార్చారు. అక్కడ యాడ్‌ ఫిలిమ్స్, హిందీ మ్యూజిక్‌ వీడియో ఆల్బమ్స్‌తో కెరీర్‌ని మొదలుపెట్టారు భూమిక. జీ టీవీ సిరీస్‌ ‘హిప్‌ హిప్‌ హుర్రే’లో తొలిసారిగా భూమికకు అవకాశం వచ్చింది.

తెలుగులో రూపుదిద్దుకున్న యువకుడు సినిమాతో భూమిక తన సినీ కెరీర్‌ని మొదలుపెట్టారు. సుమంత్‌ సరసన జోడిగా ఈ సినిమాలో నటించారు. ఈ చిత్రం తరువాత ఖుషిలో నటించారు. పవన్‌ కల్యాణ్‌కు జంటగా భూమిక నటించిన ఈ సినిమా బాక్సాఫిసు వద్ద పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం తరువాత తెలుగులో భూమికకు హీరోయిన్‌గా మంచి గుర్తింపు వచ్చింది. ఆమె నటించిన ఒక్కడు, సింహాద్రి సినిమాలు ఒకే ఏడాది విడుదలై ఆ ఏడాది తెలుగులో అత్యధికంగా వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో చోటు సంపాదించుకోగలిగాయి.

తెలుగులో పవన్‌ కల్యాణ్, ప్రీతి జింగానియా, అదితి గోవిత్రికర్‌ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన తమ్ముడు సినిమాకి రీమేక్‌గా తమిళ్లో బద్రి తెరకెక్కింది. ఈ సినిమాతో తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టారు భూమిక. ఆ తరువాత రోజా కూట్టం అనే సినిమాలో శ్రీకాంత్‌కు జోడిగా నటించారు. ఆ తరువాత కూడా భూమిక తమిళ్లో ఎన్నో సినిమాలలో నటించి ఆ పరిశ్రమలో కూడా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This