వాస్తవాధీన రేఖ వెంట కీలక శిఖరాలపై భారత్​ పట్టు

ఇండో-చైనా సరిహద్దుల్లో భారత సైన్యం ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తూ డ్రాగన్‌ ఎత్తులను చిత్తు చేస్తోంది. గత మూడు వారాల్లో భారత సైన్యం లద్ధాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న.. ఆరు ప్రధాన ఎత్తయిన కొండలను స్వాధీనం చేసుకుందని ప్రభుత్వ వర్గాలు ఓ మీడియాతో తెలిపాయి.

ఆయా వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. “ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్‌ రెండో వారం వరకు వాస్తవాధీన రేఖ వెంబడి భారత సైన్యం ఆరు ముఖ్యమైన కొండలను స్వాధీనం చేసుకుంది. వాటిలో మగర్‌ హిల్‌, గురుంగ్‌ హిల్‌, రిసెహెన్‌ లా, రెజంగ్‌ లా, మొఖ్పారీ, ఫింగర్‌ 4 సమీపంలో మరో ఎత్తయిన ప్రాంతం” ఉన్నాయని తెలిపాయి.

నిఘా పటిష్ఠం..

“చైనా ముందుగా ఆయా కొండలను ఆక్రమించి భారత్‌ను దెబ్బ తీయాలని భావించినప్పటికీ.. భారత సైన్యం ఎంతో అప్రమత్తంగా వ్యవహరించి వాటిని స్వాధీనం చేసుకుంది. దీని ద్వారా ఇప్పుడు మన దళాలకు శత్రువుల కదలికలపై నిఘా పెట్టడం మరింత సులువు అవుతుంది. అలా చైనా ప్రయత్నాలు విఫలం కావడం వల్ల పాంగాంగ్‌ ఉత్తర ప్రాంతంలో డ్రాగన్‌ సైన్యం మూడు సార్లు గాల్లోకి కాల్పులకు తెగబడింది. భారత సైన్యం ఆయా ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం వల్ల రెజంగ్‌ లా, రెచెన్‌ లా కొండల సమీపంలో చైనా ఆర్మీ 3 వేల అదనపు సాయుధ బలగాలను మోహరించింది. డ్రాగన్‌ సైన్యం పలు విధాలుగా రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌, ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ నరవణేల పర్యవేక్షణలో భారత భద్రతా దళాలు పనిచేస్తున్నాయి” అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

భారత్‌, చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖను మార్పు చేసేందుకు చైనా యత్నించడం వల్ల.. గత కొన్ని నెలలుగా రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో జూన్‌లో గల్వాన్‌ లోయ సమీపంలో చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ హద్దులు మీరి 20 మంది భారత సైనికులను పొట్టన పెట్టుకుంది. అప్పట్నుంచి భారత్‌ కూడా సైన్యం ఆయుధాలు ఉపయోగించవద్దనే నిబంధనలో మార్పులు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This