బెంగళూరు విధ్వంసం వెనుక ఆ పార్టీ హస్తం!

బెంగళూరు నగరంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పును తలపిస్తోంది. మంగళవారం చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో సాయుధ బలగాలను రంగంలోకి దిగింది. ప్రస్తుతం వాతావరణం నిశ్శబ్దంగా మారింది. విధ్వంస ఘటనలపై కర్ణాటక ప్రభుత్వం విచారణ తీవ్రం చేసింది. ఈ సంఘటన వెనుక సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎస్‌డీపీఐ) పాత్ర ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని రాష్ట్ర హోంమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు. లోతైన విచారణ జరుపుతామన్నారు.

ఏడుగురే కథ నడిపారు…

ఘర్షణలకు కేంద్రమైన దేవరజీవనహళ్లిలో ఏడుగురు వ్యక్తులే మొత్తం వ్యవహారం నడిపినట్లు తొలి కేసు నమోదైందన్నారు. వారికి సహకరించిన 16 మంది ఎస్‌డీపీఐ సభ్యులను అదుపులోకి తీసుకున్నామని మంత్రి చెప్పారు. ఈ విధ్వంసానికి పాల్పడిన వారిలో అత్యధికులు స్థానికులు కాకపోవటం వెనుక పెద్ద ప్రణాళిక ఉన్నట్లు తేలిందన్నారు.

ఆందోళనకు కారణమైన ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస్‌ (కాంగ్రెస్‌) అల్లుడి ఫేస్‌బుక్‌ అకౌంట్‌ నుంచి గత 15గంటలుగా మరో వివాదాస్పద పోస్టింగ్‌ ప్రచారం అవుతున్నట్లు హోంశాఖ గుర్తించింది. ఆ వ్యక్తి 23 గంటలుగా పోలీసుల అదుపులో ఉన్నా ఫేస్‌బుక్‌ పోస్టింగ్‌లు ప్రచారం కావటంపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దృష్టిపెట్టారు. ఆ అకౌంట్‌ను అజ్ఞాతంగా ఎవరో కొనసాగిస్తున్నారని గుర్తించి విచారిస్తున్నారు.

మరోవైపు బాధిత ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులు బూడిదైన తమ ఇంటిని గురువారం సందర్శించారు. దాదాపు రూ.1.5 కోట్ల విలువైన ఆస్తులను నష్టపోయినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే ఇంటి పరిసరాల్లోని పలు నివాసాలనూ దుండగులు ధ్వంసం చేశారు. ఆ బాధితులంతా సాయం చేయాలంటూ ఎమ్మెల్యే ఇంట్లో బైఠాయించారు. నిందితుల నుంచే బాధితులకు జరిగిన నష్టాన్ని వసూలు చేస్తామని హోంమంత్రి వీరికి హామీ ఇచ్చారు. డీజే హళ్లి ఘటనలపై పాలక- విపక్షాల మధ్య మాటల యుద్ధం మరోవైపు రాజకీయాలనూ వేడెక్కిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This