అయోధ్య కేసు తీర్పు విజయోత్సవాలపై ఆంక్షలు

అయోధ్య రామ జన్మభూమి-బాబ్రీ మసీదు కేసుపై ఈ వారంలో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తీర్పునకు సంబంధించి విజయోత్సవాలు లేదా నిరసన కార్యక్రమాలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్​ 10న ఇచ్చిన ఉత్తర్వులలో మరో 30 సూచనలను జోడిస్తూ.. రామ జన్మభూమికి సంబంధించి సమావేశాలు, ఊరేగింపులు, ర్యాలీలు, గోడలపై రాతలు, ఇతర కార్యక్రమాలను నిషేధిస్తున్నట్లు తెలిపారు అధికారులు.

దేవతలను అవమానించడం, విగ్రహాలను ఏర్పాటు చేయటం, రామజన్మభూమికి సంబంధించిన ఊరేగింపుల కోసం సామాజిక మాధ్యమాలను వినియోగించటంపైనా ఆంక్షలు విధించారు జిల్లా మేజిస్ట్రేట్​ అనుజ్​ కుమార్​ ఝా. అక్టోబర్​ 12న జారీ చేసిన ఉత్తర్వులు డిసెంబర్​ 28 వరకు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారతీయ శిక్షా స్మృతి సెక్షన్​ 188 ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు.

అయోధ్య కేసుపై తీర్పు వెలువరించే సమయంలోనే ప్రముఖ పండుగలు ఛాట్​ పూజ, కార్తీక పౌర్ణిమ, చౌదరి చరణ్​ సింగ్​ జన్మదినోత్సవం, గురునానక్​ జయంతి, ఈద్​ ఉల్​ మిలాద్​, క్రిస్​మస్​ ఉన్నందున ఆంక్షలు విధించినట్లు అధికారులు తెలిపారు.

జాతీయ భద్రతా చట్టం..

అయోధ్య కేసుకు సంబంధించి రెచ్చగొట్టే పోస్టులను పెట్టి, శాంతిభద్రతల సమస్యలకు కారణమయ్యేవారిపై జాతీయ భద్రతా చట్టం ప్రకారం కేసులను నమోదు చేస్తామని ఉత్తర్‌ ప్రదేశ్‌ డీజీపీ ఓ.పి. సింగ్‌ హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై జాతీయ భద్రతా చట్టం ప్రయోగించడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. అన్నిరకాల సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలను పర్యవేక్షించేందుకు అధికారుల బృందాన్ని ఏర్పాటు చేశామని కూడా సింగ్‌ వెల్లడించారు. అయోధ్య కేసుకు సంబంధించి అభ్యంతరకరమైన, వివాదాస్పదమైన పోస్టులను గుర్తించి అవి చేసిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This