హర్భజన్ రికార్డుపై కన్నేసిన అశ్విన్

టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ రికార్డుపై రవిచంద్రన్‌ అశ్విన్‌ గురిపెట్టాడు. శుక్రవారం చెన్నైలో ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌లో భజ్జీ రికార్డును బద్దలు కొట్టాలని అశ్విన్‌ భావిస్తున్నాడు. ఇప్పటివరకు 74 టెస్టులాడిన అశ్విన్‌ 377 వికెట్లు పడగొట్టాడు. అనిల్‌ కుంబ్లే (619), కపిల్‌దేవ్‌ (434), హర్భజన్‌సింగ్‌ (417)ల తర్వాత అత్యధిక వికెట్లు తీసిన నాలుగో భారత బౌలర్‌ అశ్వినే.

ఇందులో 254 వికెట్లు సొంతగడ్డపై తీశాడు అశ్విన్. భారత్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో కుంబ్లే (350), భజ్జీ (265) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. రానున్న ఇంగ్లాండ్‌ సిరీస్‌లో అశ్విన్‌ మరో 12 వికెట్లు తీస్తే భజ్జీని వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకుంటాడు. మరో 8 మందిని ఔట్‌ చేస్తే స్వదేశంలో ఇంగ్లాండ్‌పై 50 వికెట్లు తీసిన బౌలర్ల క్లబ్‌లో చేరతాడు. బి.ఎస్‌.చంద్రశేఖర్‌ (64), కుంబ్లే (56), బిషన్‌సింగ్‌ బేడీ (50)లు ఈ జాబితాలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This