ఉత్తర్​ప్రదేశ్​ గ్యాంగ్​స్టర్​ వికాస్​ దూబే అరెస్ట్​

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాన్పుర్‌ ఎన్‌కౌంటర్‌లో ప్రధాన సూత్రధారి అరెస్టయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో రౌడీ షీటర్​ వికాస్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఈ నెల 3న అర్ధరాత్రి కాన్పుర్‌లో అతడిని పట్టుకునేందుకు వచ్చిన పోలీసు బృందంపై వికాస్​ గ్యాంగ్​ కాల్పులు జరిపింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 8 మంది పోలీసులు అమరులయ్యారు. అప్పటినుంచి పరారీలో ఉన్నాడు వికాస్​. అతని కోసం యూపీ పోలీసు బృందాలు విస్తృతంగా గాలించాయి. ఎట్టకేలకు ఇవాళ ఉదయం చిక్కాడు.

అలా దొరికాడు..

వికాస్​.. మధ్యప్రదేశ్​ ఉజ్జయినిలోని మహాకాల్​ ఆలయానికి వెళ్తుండగా.. భద్రతా సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన స్థానిక పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం.. తానే వికాస్​ దూబేనని, కాన్పుర్​ వాసినని అంగీకరించాడు.

వికాస్​ అరెస్టును మధ్యప్రదేశ్ హోం​ మంత్రి నరోత్తమ్​ మిశ్రా ధ్రువీకరించారు. యూపీ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.

దూబే అరెస్టైన విషయాన్ని మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​కు ఫోన్​లో తెలిపారు. ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులకు నిందితుడిని అప్పగించనున్నట్లు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This