అటు చైనా.. ఇటు శీతాకాలం.. భారత్​ దేనికైనా రె’ఢీ’

తూర్పు లద్దాఖ్‌లో గుడ్లురుముతున్న చైనాకు తన సత్తాను చాటేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధమైంది. ఎముకలు కొరికే చలికి సైతం తమను కదిలించే దమ్ము లేదని చాటేందుకు సిద్ధమైంది. శీతాకాలం ఆరంభం కాగానే భారత సేన వెనుదిరుగుతుందన్న డ్రాగన్‌ అపోహలను పటాపంచలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఇందుకోసం మన బలగాలు చేపట్టిన అతిపెద్ద సైనిక సరఫరా ఆపరేషన్‌ దాదాపుగా పూర్తికావొస్తోంది. ఇందులో భాగంగా భారీ ట్యాంకులు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇంధనం, ఆహారం, శీతాకాల నిత్యావసరాలు ఎత్తయిన ప్రాంతాలకు తరలివెళ్లాయి. ఈ ఆపరేషన్‌ను సైన్యాధిపతి జనరల్‌ ఎం.ఎం.నరవణె వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు భారత్‌ అటు చైనాను, ఇటు హిమాలయ శీతాకాలాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది.

తూర్పు లద్దాఖ్‌లో చలికాలం ఆరంభమవుతోంది. అక్కడ.. చైనాతో సాగుతున్న వివాదం ఇప్పట్లో పరిష్కారమయ్యే అవకాశం లేకపోవడంతో శీతాకాలంలోనూ ఇదే సంఖ్యలో బలగాలను కొనసాగించాలని భారత సైన్యం నిర్ణయించింది. ఇక్కడ 50 వేల మందికిపైగా సైనికులు ఉన్నారు. వీరిని శీతాకాలంలో కొనసాగించడం ఆషామాషీ కాదు. ఇందుకోసం భారీగా సామగ్రి అవసరం. వీటిని మన సైన్యం.. అక్కడికి హుటాహుటిన తరలిస్తోంది. ఇందుకోసం జులై మధ్యలోనే ఆపరేషన్‌ ప్రారంభం కాగా.. అది ఇప్పుడు పూర్తికావొస్తోంది. ఈ ఆపరేషన్‌లో భాగంగా భారత సైన్యం.. పెద్ద సంఖ్యలో టి-90, టి-72 ట్యాంకులు, శతఘ్నులు, పదాతిదళ పోరాట శకటాలను చుషుల్‌, దెమ్‌చోక్‌ సహా సున్నితమైన అన్ని ప్రాంతాలకూ తరలించింది. భారీగా శీతాకాల దుస్తులు, గుడారాలు, వేల టన్నుల ఆహార పదార్థాలు, కమ్యూనికేషన్‌ సాధనాలు, ఇంధనం, హీటర్లు, ఇతర సరఫరాలను.. సరిహద్దు శిబిరాలకు చేరవేసింది. వీటిలో కొన్ని.. సముద్రమట్టానికి 16 వేల అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఈ ఆపరేషన్‌ కోసం భారత వాయుసేనలోని సి-130జె, సి-17 గ్లోబ్‌మాస్టర్‌ సహా అన్ని రవాణా విమానాలు, హెలికాప్టర్లను ఉపయోగించింది. స్వాతంత్య్రం తర్వాత లద్దాఖ్‌లో చేపట్టిన అతిపెద్ద ఆపరేషన్‌ ఇదేనని సీనియర్‌ సైనికాధికారి ఒకరు చెప్పారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా బారులు తీరిన యుద్ధట్యాంకులు, సాయుధ శకటాలు కనిపిస్తున్నాయి.

కఠోర వాతావరణం..

తూర్పు లద్దాఖ్‌లో అక్టోబర్‌ నుంచి జనవరి మధ్య ఉష్ణోగ్రతలు మైనస్‌ 5 నుంచి మైనస్‌ 35 డిగ్రీల సెల్సియస్‌ మేర ఉంటాయి. రాత్రివేళ పెనువేగంతో వీచే శీతల గాలులు.. మనిషిని నిలువునా గడ్డకట్టించేస్తాయి. అందువల్ల వాతావరణాన్ని తట్టుకోవడానికి శీతాకాల దుస్తులు, ఇతర ఉపకరణాలను ఐరోపా దేశాల నుంచి భారత్‌ దిగుమతి చేసుకుంది. తీవ్ర చలిగాలులను తట్టుకునేందుకు సరికొత్త ఆవాసాలు, ప్రిఫ్యాబ్రికేటెడ్‌ నిర్మాణాలను భారత సేన యుద్ధప్రాతిపదికన నిర్మిస్తోంది. వీటికి పెద్దగా సిమెంటు, ఇసుక అవసరం లేదు. వీటిని వేగంగా వినియోగానికి సిద్ధం చేయవచ్చు. బలమైన గాలులు, చలి నుంచి రక్షించేందుకు ఈ ఆవాసాల్లో ఇన్సులేషన్‌ ఉంటుంది. హీటింగ్‌ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వంట గది, మరుగుదొడ్లు వంటివీ ఇందులో ఉంటాయి. ఇందుకోసం అధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This