అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై చర్చ..తొలివిడతో 256 సర్వీసులు

ఏపీ నుంచి తెలంగాణకు తొలివిడతగా 256 సర్వీసులు నడిపేందుకు తాము సిద్ధమని ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ జాబితాను టీఎస్‌ఆర్టీసీ అధికారులకు అందజేశారు. రెండు ఆర్టీసీల ఈడీలు, ఇతర అధికారులు అంతర్రాష్ట్ర ఒప్పందంపై విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో గురువారం ప్రాథమిక చర్చలు జరిపారు. సమాన కిలోమీటర్ల మేరకు బస్సులు నడపటంపై ప్రధానంగా చర్చ జరిగింది. ఒప్పందం పూర్తయితే నాలుగు విడతలుగా బస్సు సర్వీసులు పునరుద్ధరించాలని నిర్ణయించారు. ముందుగా రెండు రాష్ట్రాల్లో, దారి మధ్యలో ఎక్కడెక్కడ కంటెయిన్‌మెంట్‌ జోన్లు ఉన్నాయన్న విషయంపై చర్చించారు.

తొలి విడతలో ఏపీ నుంచి నడిపే 256 సర్వీసులు తెలంగాణలో నిత్యం 70వేల కిలోమీటర్లు తిరుగుతాయని లెక్కించారు. దీంతో టీఎస్‌ఆర్టీసీ అధికారులు అటు నుంచి ఎన్ని సర్వీసులు నడపాలనే ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. ఇరు సంస్థల అధికారులు ఈనెల 23న హైదరాబాద్‌లో భేటీ అవుతారు. అప్పుడు చర్చలు కొలిక్కి వస్తే, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శుల భేటీలో ఒప్పందం ఖరారవుతుంది. ఏపీ నుంచి మొత్తం వెయ్యి సర్వీసులు తెలంగాణకు నడుపుతారు. ఇవి అక్కడ 5 లక్షల కిలోమీటర్ల వరకు తిరుగుతాయి. తెలంగాణ ఆర్టీసీ కూడా ఆ మేరకు ప్రణాళిక సిద్ధం చేయనుంది. తెలంగాణకు తొలివిడత నడిపే సర్వీసుల్లో అత్యధికంగా విజయవాడ నుంచి 66 ఉన్నాయని ఏపీఎస్‌ఆర్టీసీ ఈడీ (ఆపరేషన్‌) కేఎస్‌బీ రెడ్డి తెలిపారు.

ప్రైవేటు బస్సులకు అనుమతి
రాష్ట్ర పరిధిలో స్టేజ్‌, కాంట్రాక్ట్‌ క్యారియర్‌ బస్సులు నడిపేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వీటితోపాటు ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్‌లు, ఆటోలు, సొంత వాహనాలను కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ నడిపేలా రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఆదేశాలు జారీచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This