అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ ‘నాడు-నేడు’

అంగన్‌వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక విద్య పాఠశాలల(ప్రీ స్కూల్‌) తరహా విధానంలోకి తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మాదిరిగానే అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ ‘నాడు-నేడు’ కింద అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఫర్నిచర్‌, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, ఫ్రిజ్‌, పరిశుభ్రమైన తాగునీరు, మరుగుదొడ్లు, రంగులు, బ్లాక్‌బోర్డులు, ప్రహరీగోడ సహా ఇతర సదుపాయాలు కల్పించాలని సూచించారు. దీని కోసం విద్యాశాఖ అధికారులతో కలిసి పని చేయాలన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమశాఖపై సీఎం గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘గర్భిణులు, బాలింతలు, చిన్నారుల పౌష్టికాహారంపై గత ప్రభుత్వ హయాంలో రూ.740 కోట్లు వెచ్చిస్తే కొత్త ప్రభుత్వం 2019-20లో రూ.1,100 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఏడాదిలో దీన్ని పెంచి రూ.1,862 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అంగన్‌వాడీల్లో పరిశుభ్ర వాతావరణం ఉండాలి. పౌష్టికాహారం నాణ్యత మరింత పెంచడానికి ప్రణాళిక రూపొందించాలి. ‘నాడు-నేడు’ కింద 24 వేల అంగన్‌వాడీ కేంద్రాల్లో చేపట్టాల్సిన పనులు, సదుపాయాలపై అంచనాలు సిద్ధం చేయాలి. 31 వేల అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలకు అంచనాలు తయారు చేయాలి. బకాయిలు లేకుండా గ్రీన్‌ఛానెల్‌లో చెల్లింపులు జరిగేలా చూడాలి’ అని ఆదేశించారు.

నిర్మాణానికి రూ.149 కోట్లు
రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణానికి రూ.149.63 కోట్ల విడుదలకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం భాగస్వామ్యంతో ఈ కేంద్రాలను నిర్మించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This