గవర్నర్‌ నిర్ణయంపై తీవ్రస్థాయిలో నిరసనలు

అమరావతిని విచ్ఛిన్నం చేసేందుకు దిల్లీ పెద్దల నాటకంలో భాగంగానే బిల్లులపై గవర్నర్‌ సంతకం చేశారని రాజధాని అమరావతి పరిరక్షణ జేఏసీ కన్వీనరు పువ్వాడ సుధాకర్‌ అన్నారు. శనివారం నుంచి అన్ని శిబిరాల్లో పెద్దఎత్తున నిరసన దీక్షలు చేసి ప్రభుత్వం కళ్లు తెరిపించాలన్నారు. ఇకనుంచి 29 గ్రామాల్లోనే కాకుండా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉద్యమిస్తామన్నారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి గ్రామాల్లో శుక్రవారం రైతులు, మహిళలు పెద్దఎత్తున దీక్షలు చేశారు.

కొవ్వొత్తులను చేతబూని రాజధాని అమరావతి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. వెలగపూడి, నెక్కల్లులో కొందరు రైతులు రోడ్లపై టైర్లు తగలబెట్టారు. మహిళలు కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బిల్లుల ఆమోదం పొందాయన్న నిర్ణయంతో వెలగపూడిలో జొన్నలగడ్డ సురేశ్‌ అనే రైతు చెప్పుతో కొట్టుకున్నారు. తమకు మరణం కన్నా మరో దారి లేదంటూ వెలగపూడిలో కొందరు రైతులు నీళ్లట్యాంకు ఎక్కేందుకు యత్నించారు. పోలీసులు అమరావతి గ్రామాల్లో భారీగా మోహరించారు.

నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు
పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను గవర్నర్‌ ఆమోదించడాన్ని నిరసిస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని అమరావతి రైతుల ఐకాస పిలుపునిచ్చింది. శనివారం నుంచి దీక్షలు కొనసాగుతాయని అమరావతి పరిరక్షణ సమితి ఐకాస కన్వీనరు శివారెడ్డి తెలిపారు.

న్యాయ పోరాటానికి సిద్ధం
రాష్ట్ర చరిత్రలో ఇది దుర్దినమని, అమరావతే రాజధాని కావాలంటూ కుల, మత, ప్రాంతాలకతీతంగా ఉద్యమం చేస్తుంటే బిల్లులపై గవర్నర్‌ సంతకాలు చేయడం ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని అమరావతి పరిరక్షణ సమితి (జేఏసీ) కన్వీనర్‌ ఎ.శివారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని రాజధాని పరిరక్షణ సమితి కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎస్‌ఈసీ విషయంలో లాగే రాజధాని అంశంలోనూ ప్రభుత్వం అభాసు పాలవుతుందన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని, జనసేనాని పవన్‌కల్యాణ్‌ కలసి రావాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This