‘రమేష్‌ ఆసుపత్రి యాజమాన్యం కోసం గాలిస్తున్నాం’

విజయవాడలోని హోటల్‌ స్వర్ణప్యాలెస్‌లోని కొవిడ్‌ కేర్‌ సెంటరులో జరిగిన అగ్నిప్రమాదం కేసులో తప్పు ఎవరిదైనా చర్యలు తీసుకుంటామని నగర పోలీసు కమిషనర్‌ బి.శ్రీనివాసులు తెలిపారు. సహకరించకపోతే తప్పు చేశారని అనుకుంటున్నామన్నారు. అగ్నిప్రమాదం జరిగిన తర్వాత రమేష్‌ ఆసుపత్రి యాజమాన్యం పరారీలో ఉందని, వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశామని తెలిపారు. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల్లో గాలిస్తున్నామన్నారు. యాజమాన్యం వివరాలు తెలియజేసిన వారికి రూ.లక్ష రివార్డు ఇస్తామని ప్రకటించారు. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఎవరూ సహకరించటం లేదన్నారు. ముందుగా హోటల్‌తో ఒప్పందం ఉందని చెప్పారని, ఒప్పంద పత్రం మాత్రం చూపించలేదని వివరించారు. ఆసుపత్రి బోర్డు నెలవారీ సమావేశాల నివేదికలను కూడా ఇప్పటికీ ఇవ్వలేదని తెలిపారు. అగ్నిమాపక శాఖ అనుమతి లేకుండానే కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటుచేశారని, అక్కడున్న ఒక్క అగ్నిమాపక యంత్రం కూడా పనిచేయలేదని వివరించారు. యాజమాన్యం పరారీలో ఉన్నదని, వారికి పలుమార్లు నోటీసులనిచ్చామని స్పష్టం చేశారు. ‘మాకు పార్టీలు, కులం, మతమంటూ లేవు. చట్ట ప్రకారం నడుచుకుంటాం. ఆసుపత్రి యాజమాన్యం ముందుకు వస్తే త్వరగా దర్యాప్తు పూర్తి చేస్తాం’ అని సీపీ వెల్లడించారు.

  • డాక్టర్‌ రమేష్‌బాబుపై వేధింపులు ఆపాలి: ఆసుపత్రి ఉద్యోగుల సంఘం

‘కులమతాలు, రాజకీయాలకు అతీతంగా రోగులకు సాంత్వన కలిగించడమే మా విధి. మా ఆసుపత్రిలోని వైద్యులు, పారామెడికల్‌, నర్సింగ్‌ సిబ్బంది ముందుకు వచ్చి 500 మంది కొవిడ్‌ రోగులకు వైద్య సేవలందించారు. ఆ క్రమంలో జరిగిన అగ్నిప్రమాదాన్ని దురదృష్టకరమైన సంఘటనగానే చూడాలని రాష్ట్ర ప్రజానీకానికి, నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని విజయవాడలోని రమేష్‌ ఆసుపత్రి ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఒక ప్రకటనలో కోరారు. మా కుటుంబ పెద్ద డాక్టర్‌ రమేష్‌బాబును వేధించడం ఆపాలని కోరారు. ఆసుపత్రి వైద్య, వైద్యేతర సిబ్బంది తరఫున గణపతి, హమీద్‌, కల్యాణలక్ష్మి గురువారం ఈ ప్రకటన విడుదల చేశారు. రమేష్‌ ఆసుపత్రి వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధినిస్తోందని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This