అప్పుల మీదే నెట్టుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వం!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నెలవారీ చేబదుళ్ల మీదే ఆధారపడి బండి లాగిస్తోంది. గత నాలుగు నెలల్లో మూడు నెలల పాటు రిజర్వు బ్యాంకు దగ్గర వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెస్‌ (డబ్ల్యుఎంఏ)కు వెళ్లినట్లు తాజాగా విడుదలైన బులెటిన్‌ వెల్లడించింది. మార్చి నుంచి జూన్‌ వరకు (ఏప్రిల్‌ మినహా) ప్రతినెలా ఇదే పరిస్థితి. బడ్జెట్‌ పద్దులను చేరుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి నెలా బహిరంగ మార్కెట్‌ నుంచి రుణాలు సేకరిస్తాయి. ఆ పరిమితి పూర్తయ్యాక ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి రిజర్వు బ్యాంకు నుంచి స్పెషల్‌ డ్రాయింగ్‌ ఫెసిలిటీ (ఎస్‌డీఎఫ్‌), వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెస్‌ (డబ్ల్యుఎంఏ), ఓవర్‌డ్రాఫ్ట్‌ (ఓడీ) ద్వారా చేబదుళ్ల కింద డబ్బు తీసుకొని రోజువారీ ఖర్చులకు సర్దుబాటు చేసుకుంటాయి. రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక అస్థిరతకు అద్దం పట్టే కొలమానాలివి. చాలా రాష్ట్రాలు ఇందులో ఒకటో, రెండో సౌకర్యాలనే ఉపయోగించుకుంటాయి. మూడింటినీ వినియోగించుకునే రాష్ట్రాలు కొన్నే ఉంటాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్‌, కేరళ ముందున్నాయి.

మూడునెలల్లో 14వేల కోట్ల రుణం

ఆర్‌బీఐ బులెటిన్‌ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో బహిరంగ మార్కెట్‌ నుంచి రూ.14వేల కోట్ల స్థూల, రూ.11,667 కోట్ల నికర రుణం సేకరించింది. రుణ సేకరణ ఇలాగే ఉంటే సంవత్సరాంతానికి ఇది రూ.56 వేల కోట్లకు చేరే అవకాశం కనిపిస్తోంది. అంతకుముందు 2018-19లో రూ.30,200 కోట్లు, 2019-20లో రూ.42,915 కోట్లు సేకరించింది.

వడ్డీల భారం…

తొలుత రాష్ట్ర ప్రభుత్వాలు తమ పెట్టుబడులను పూచీకత్తుగా పెట్టి ఎస్‌డీఎఫ్‌ కింద రుణం తీసుకోవచ్చు. దీనిపై రెపోరేట్‌కు 1% తక్కువగా వడ్డీ చెల్లించాలి. తర్వాత వేస్‌ అండ్‌ మీన్స్‌ సౌకర్యంలో చేబదులు తీసుకోవచ్చు. ఇలా ఎన్ని రోజులు తీసుకుంటే అన్ని రోజులకు రెపోరేట్‌ కంటే 1% అదనంగా వడ్డీ కట్టాలి. ఈ రెండూ ఉపయోగించుకున్న తర్వాత కూడా ఆర్థిక అవసరాలు తీరని రాష్ట్రాలు ఓడీకి వెళ్తాయి. ప్రతినెలా 14 పనిదినాలపాటు ప్రభుత్వాలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. తన ఖాతాలో నిధులు లేకపోయినా ఆర్‌బీఐ ఖాతా నుంచి ఉపయోగించుకోవచ్చు. 14 రోజులకు మించి ఓవర్‌డ్రాఫ్ట్‌కు వెళ్తే ఆర్‌బీఐ, దాని అనుబంధ సంస్థలు ఆ రాష్ట్రానికి చేయాల్సిన చెల్లింపులను ఆపేస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This