ఎగుమతుల వృద్ధికి భేషైన వ్యూహం

గల్వాన్‌ లోయలో చైనా దుస్సాహసానికి ప్రతీకారంగా బీజింగ్‌ నుంచి దిగుమతులపై ప్రభుత్వ భారీ సుంకాల వడ్డన దరిమిలా- భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తాజాగా నిర్దిష్ట ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. సంక్షుభిత వాతావరణం నేపథ్యంలో ఎగుమతుల స్థిరాభివృద్ధిని లక్షిస్తూనే అత్యవసర ముడిసరకుల దిగుమతిలో అనుసరించదగ్గ వ్యూహాల్నీ సూచిస్తూ దశసూత్ర ప్రణాళికను క్రోడీకరించింది. ఉన్నట్టుండి ఆకస్మిక అరకొర చర్యల జోలికి పోకుండా దీర్ఘకాలిక యోజనతో ఇదమిత్థమైన లక్ష్యాలతో పురోగమించాలన్న హితవాక్యం ప్రభుత్వానికి శిరోధార్యం.

దీటైన చర్యలకు పిలుపు

అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రస్తుతం భారత్‌ ఎగుమతుల వాటా కేవలం 1.67 శాతం. అదే సేవారంగంలో, కొంత మెరుగ్గా మూడున్నర శాతందాకా లెక్క తేలుతోంది. 2025 సంవత్సరంనాటికి విశ్వవాణిజ్యంలో మన ఎగుమతులు అయిదు శాతానికి, సేవల రంగంలో వాటా ఏడు శాతానికి పెరగాలంటున్న సీఐఐ- దీటైన చర్యలకు పిలుపిస్తోంది. రసాయనాలు, పెట్రో కెమికల్స్‌, ఎలెక్ట్రానిక్స్‌, ఔషధ ఉక్కు జౌళి తదితర రంగాల్లో ఎలా పావులు కదపాలో సిఫార్సులు పొందుపరచింది. రాష్ట్రప్రభుత్వాలకూ ప్రాతినిధ్యం కల్పిస్తూ ప్రత్యేక కార్యదళం అవతరణనూ ప్రతిపాదించింది. అంతర్జాతీయ విలువ గొలుసు(వేల్యూ చెయిన్‌)లో భారత్‌ భాగస్వామ్యం ఇతోధికం కావడానికి, విలువ జోడింపు తరవాత సత్వర ఎగుమతులకు పకడ్బందీ ప్రణాళిక ఉండి తీరాలి. ఆభరణాలు, ఔషధ ఉత్పాదనలు సహా 31 అంశాల్ని ఎగుమతుల వృద్ధికి దోహదపడేవిగా సీఐఐ ఇప్పటికే గుర్తించింది. దాన్ని వెన్నంటి భారత్‌ను ప్రధాన ఎగుమతిదారుగా సువ్యవస్థీకరించడమే లక్ష్యంగా సహేతుక సుంకాల విధానం పదును తేలాలి.

కొవిడ్​కు ముందే మందగమనం

కొవిడ్‌ మహమ్మారి రూపేణా పెను సంక్షోభం కమ్మేయడానికి మునుపే గత డిసెంబరులో దేశార్థికం మీద మాంద్యం క్రీనీడల దుష్పరిణామాల్ని సీఐఐ లోతుగా విశ్లేషించింది. అప్పటికే వాషింగ్టన్‌-బీజింగ్‌ల మధ్య ముదిరిన వాణిజ్యయుద్ధం పర్యవసానాల్ని ప్రస్తావిస్తూ ప్రధాన విపణులైన అమెరికా, ఈయూలతో మనకు పెరిగిన దూరమెంత నష్టదాయకమో విపులీకరించింది. ఎగుమతుల్ని సముత్తేజపరచే నూతన పథకాలు, వైవిధ్యభరిత ఉత్పత్తులు కీలకమంటూ అప్పట్లో చేసిన మేలిమి సూచన నేటికీ వర్తిస్తుంది.

హెచ్చరికల్ని ఉపేక్షించలేం

చైనానుంచి ముడిసరకుల దిగుమతులకు అమాంతం తలుపులు మూసేస్తే రసాయనాలు, రంగులు, ఎలెక్ట్రానిక్‌ వస్తువులు, ఔషధ రంగ సంస్థలు దారుణంగా దెబ్బతింటాయన్న హెచ్చరికల్ని ఉపేక్షించలేం. వాటినే దక్షిణ కొరియా, జపాన్‌, ఐరోపాలనుంచి రప్పించాలంటే 25-40శాతం దాకా ఖర్చులు పెరిగిపోతాయని అంచనా. భారత ఎగుమతుల జాబితాలోని రత్నాలు, ఆభరణాలు, జౌళి ఉత్పాదనల పద్దు కొన్నాళ్లుగా క్షీణదశను సూచిస్తోంది. చైనా నుంచి పోటీ ఉద్ధృతమై కాఫీ, తేనీరు, సుగంధ ద్రవ్యాల్లాంటి సంప్రదాయ ఎగుమతులూ సన్నగిల్లుతున్నాయి. ఈ దుస్థితిని చెదరగొట్టడంలో గిడ్డంగులు సహా విస్తృత మౌలిక సదుపాయాల పరికల్పనది నిర్ణాయక భూమిక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This