తెదేపా ఎమ్మెల్యేలకు శాసనసభ ప్రివిలేజ్‌ కమిటీ నోటీసులు

రాష్ట్ర శాసనసభ ప్రివిలేజ్‌ కమిటీ ..తెదేపా ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, రామానాయుడికి నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లోపు లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. వెలగపూడిలోని అసెంబ్లీ కమిటీ హాలులో బుధవారం కమిటీ ఛైర్మన్‌ కాకాని గోవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. తెదేపా శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడిపై ప్రభుత్వ చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి, వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్‌ చేసిన రెండు ఫిర్యాదులు, తెదేపా ఎమ్మెల్యే రామానాయుడిపై శాసనసభలో చేసిన సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం, శ్రీకాకుళంలో అధికారులు సభాహక్కులను ఉల్లంఘించడం అనే మొత్తం 4 అంశాలపై చర్చించారు.

ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు, అసెంబ్లీ చీఫ్‌ మార్షల్‌పై తెదేపా తరఫున ఇచ్చిన 7 సభాహక్కుల ఉల్లంఘన నోటీసులపైనా చర్చించాలని ఆ పార్టీ తరఫున కమిటీలో సభ్యుడిగా ఉన్న అనగాని సత్యప్రసాద్‌ కోరారు. ఈ నోటీసులకు సంబంధించిన రికార్డులు కమిటీకి రాలేదని ఛైర్మన్‌ కాకాని చెప్పారు. సత్యప్రసాద్‌ స్పందిస్తూ.. శాసనసభ కార్యదర్శి వద్ద రికార్డులు లేకపోవడమేంటని ప్రశ్నించారు. కమిటీ నిబంధనల ప్రకారం సభలో తీర్మానం చేసిన.. సభాపతి సూచించిన వాటిపైనే చర్చించగలమని కాకాని స్పష్టం చేశారు. ‘కమిటీ అందరు సభ్యులకు సంబంధించినది కదా? పక్షపాతంగా కొన్నింటినే చర్చిస్తే ఎలా? వచ్చే సమావేశంలోనైనా తెదేపా ఇచ్చిన ఫిర్యాదులపై చర్చించాలి’ అని సత్యప్రసాద్‌ కోరారు.

మరోవైపు శ్రీకాకుళంలో అధికారిక కార్యక్రమంలో శిలాఫలకంపై ఆ జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్న సభాపతి తమ్మినేని సీతారాం పేరు రాయకపోవడంపై జిల్లా యంత్రాంగానికి కమిటీ నోటీసులు జారీ చేసింది. తర్వాతి సమావేశాన్ని జనవరి 18, 19 తేదీల్లో తిరుమలలో నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. సమావేశం అనంతరం కమిటీ ఛైర్మన్‌ కాకాని గోవర్ధన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ‘సభాహక్కుల ఉల్లంఘన చేసిన వారికి నోటీసులు ఇచ్చాం. అవసరమైతే ఆయా సభ్యులు వ్యక్తిగతంగా వచ్చి వివరణ ఇవ్వమని కోరతాం’ అని తెలిపారు. సత్యప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘శాసనసభలో ఏకపక్షంగా జరుగుతున్నట్లే ప్రివిలేజ్‌ కమిటీలోనూ పక్షపాత ధోరణిలో ఫిర్యాదులపై చర్చ జరిగింది. సమావేశం అజెండా కూడా సభ్యులకు ముందుగా ఇవ్వలేదు. సభలో అధికారపక్షం రెచ్చగొట్టడం వల్లే తెదేపా సభ్యులు ప్రతిస్పందించారు. పింఛన్లపై రామానాయుడు సభలో ప్రశ్నిస్తే దాన్నీ ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేస్తామంటే ఎలా? ప్రజలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకే కదా శాసనసభ ఉంది. కనీసం వచ్చే సమావేశాల్లోనైనా తెదేపా ఇచ్చిన ఫిర్యాదులపైనా చర్చించాలని కోరాం’ అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This