విలనిజానికి సరికొత్త డిక్షనరీ అమ్రీష్​ పురి

ప్రతినాయకుడిగా తనదైన ముద్ర బలంగా వేశారు దివంగత నటుడు అమ్రీష్‌ పురి. బాలీవుడ్‌లో తన క్రూరత్వంతో ఎన్నో చిత్రాలను విజయ తీరాలకు నడిపించారు. విలన్…అంటే ఇలాగే ఉండాలనే సరికొత్త డిక్షనరీని రాశారు. నేడు ఆయన 87వ జయంతి సందర్భంగా ప్రత్యేక విశేషాలు మీకోసం..

400 సినిమాల చరిత్ర

హిందీతో పాటు కన్నడ, మరాఠీ, పంజాబీ, మలయాళం, తెలుగు, తమిళ్ లాంటి భారతీయ భాషల్లో అనేక చిత్రాలు చేసిన అమ్రీష్‌ పురి హాలీవుడ్​లో కూడా తన ప్రతిభ కనబరిచారు. విదేశీ వీక్షకులకు కూడా అమ్రీష్‌ పురి పేరు సుపరిచితం. 1984లో స్టీవెన్ స్పిల్ బెర్గ్ దర్శకత్వం వహించిన ‘ఇండియానా జోన్స్ అండ్ ది టెంపుల్ ఆఫ్ డూమ్’ చిత్రంలో మోలా రామ్ గా అమ్రీష్ పురి లబ్ధ ప్రతిష్టులు. తనకు ఎంతో ఇష్టమైన సినీ విలన్ అమ్రీష్‌ పురి అంటూ స్టీవెన్ స్పిల్ బెర్గ్ ప్రత్యేకంగా కితాబిచ్చారు. అలాగే, 1987లో విడుదలైన శేఖర్ కపూర్ హిందీ మూవీ ‘మిస్టర్ ఇండియా’ లో నటించిన అమ్రీష్‌ పురి ని ఇప్పటికీ బాలీవుడ్ ప్రేక్షకులు మరిచిపోలేరు. ఆయన సుమారు 4 వందల సినిమాల్లో నటించారు..

సోదరుల స్పూర్తితో…!

సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి అమ్రీష్‌ పురి వచ్చారు. తనకన్నా పెద్దవారైన సోదరులు చమన్ పురి, మదన్ పురి అప్పటికే ఇండస్ట్రీలో పేరు మోసిన విలన్లు. గతకాలపు గాయకుడు కె. ఎల్. సైగల్ కి అమ్రీష్‌ పురికి దగ్గర బంధుత్వం ఉంది. సోదరుల స్పూర్తితో సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాలని భావించిన అమ్రీష్ పురి మొదటి స్క్రీన్ టెస్ట్ లోనే విఫలమయ్యారు. దాంతో, సినిమాలు తనకు అచ్చి రావనే నైరాశ్యంలో కుంగిపోయిన ఆయన ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్​లో ఉద్యోగం పొందారు. కళాకారుడు కావాలన్న తపన తో పృథ్వీ థియేటర్స్ సంస్థలో చేరి సత్యదేవ్ దూబే రాసిన అనేక నాటకాలను ప్రదర్శిస్తూ వచ్చారు. ఆ నేపథ్యంలోనే 1979లో ఉత్తమ రంగస్థల కళాకారుడిగా సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు. ఈ గుర్తింపుతో టీవీలో ప్రసారమయ్యే వాణిజ్య ప్రకటనల్లో చోటు సంపాదించుకున్నారు. అలా అలా ఆయన సినీ ఇండస్ట్రీ కి కూడా పరిచయమయ్యారు. అప్పుడు ఆయన వయస్సు 40 సంవత్సరాలు. అంటే… లేటు వయస్సులో సినీ అవకాశం అందివచ్చినట్లయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This