అమ్మా.. అని పిలిపించుకోకముందే.. ఆ తల్లి..

కాన్పు చేయించి పుట్టింటికి తీసుకెళ్లాల్సిన కుమార్తెను కాటికి తీసుకెళ్లాల్సి వచ్చిందని ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. కన్నతల్లిలాంటి ఊరే కడసారి చేసే అంతిమ కార్యక్రమాలకు కాదు పొమ్మంది. కట్టుకున్న భర్త.. తోడబుట్టివారి కడచూపునకు నోచుకోని దుస్థితి ఇన్ని గండాలు ఒక్క కుటుంబాన్నే తాకితే.. నా అన్న వాళ్లంతా కనుచూపుమేర కన్పించకుంటే.. గుండెలు పగిలిపోతాయి… కన్నీరు ఇంకిపోతాయి. నవ మాసాలు మోసి కన్న బిడ్డలను తనివితీర చూడక ముందే తల్లిని కరోనా కాటేసింది. అమ్మా.. అని నోరారా పిలవకముందే నవజాత శిశువులు కన్నతల్లిని కోల్పోయారు.

హృదయ విదారకమైన సంఘటన కడప సర్వజన ఆసుపత్రిలో జరిగింది. చాపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలింత కవలలకు (మగపిల్లలు) జన్మనిచ్చింది. స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడో తరగతి వరకు చదువుకున్న ఆమెకు… గతేడాది ఆగస్టు 16న పెద్దలు వివాహం చేశారు. పెళ్లికి ముందే జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లి నాలుగేళ్లు గడిపి వచ్చిన ఆమె భర్త వివాహానంతరం భార్య గర్భం దాల్చిన నాలుగు నెలలకే తిరిగి సౌదీకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆమె ప్రొద్దుటూరు ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటుందని కుటుంబసభ్యులు తెలిపారు. ప్రసవ సమయంలో ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు పరిస్థితి విషమగా ఉందని కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ ఈ నెల 4న ఇద్దరు మగ పిల్లలకు ఆమె జన్మనిచ్చింది. అప్పటికే తీవ్ర రక్తస్రావంతో ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెకు కరోనా రావడంతో వైద్యులు కాపాడలేకపోయారు. ఆమె తమ్ముడొకరు సౌదీలోనే ఉండగా, మరొకరు గోపవరం కరోనా క్వారంటైన్‌లో ఉన్నారు. అక్క శవాన్ని చివరిసారి చూసుకునే అవకాశం కూడా వాళ్లకు దక్కలేదు. భర్త, తోబుట్టువులు, బంధువులు, దూరం కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This