సమరావతి@ ఆ 29 గ్రామాల్లో ‘అ’ అంటే.. అమరావతే

బిందువు సింధువైనట్లు..వాన వరదైనట్లు..అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం అప్రతిహతంగా సాగిపోతోంది. శాసనసభ వేదికగా… సీఎం జగన్‌ 3 రాజధానుల ప్రకటనతో పురుడు పోసుకున్న రైతు, మహిళా ఉద్యమం 200రోజులకు చేరింది. రైతుది, భూమిది విడదీయరానిబంధం. సెంటు భూమి వదులుకోవాలన్నా… ప్రాణం పోతుందనేంత సెంటిమెంటు. కానీ అమరావతి ప్రాంత రైతులు దాన్నీ పక్కనపెట్టారు. రాష్ట్ర భవిత కోసం, తమ బిడ్డల భవిష్యత్ కోసం పచ్చనిభూముల్ని ప్రభుత్వానికి హారతిపళ్లెంలో పెట్టి అప్పగించారు. ఆ తర్వాత తాత్కాలిక సచివాలయం.. శాసనసభ కార్యకలాపాలు మొదలవడం, శాశ్వత కట్టడాలూ ఓ రూపు దిద్దుకున్నాయి. తమ త్యాగాలకు ఫలితం లభిస్తుందని అనుకుంటన్న తరుణంలో వైకాపా సర్కార్‌ 3రాజధానుల ప్రతిపాదన… వారి కలల్ని చిదిమేసింది. నోటికాడ కూడు పోతుంటే… రాజధాని రైతులు సహించలేకపోయారు. కంకులు కోసే చేతులతోనే పిడికిళ్లు బిగించి సమరభేరి మోగించారు.

రాజధాని ఉద్యమానికి రైతులే సారథులు. ప్రత్యేక జెండా కూడా…. రూపొందించుకున్నారు. అమరావతి రైతులు, రైతుల కూలీల ఐకాస ఏర్పాటు…. చేసుకున్నారు. ఉద్యమంపై రాజకీయ నీడ పడకుండా పోరాటానికి అవసరమైన ఖర్చుల కోసం.. ఎకరాకు ఇంతని చందాలు వేసుకున్నారు. తొలినాళ్లలో ఉద్యమం దీక్షా శిబిరాల్లో నడిచింది. తుళ్లూరు, మందడం, వెలగపూడి సహా పలు గ్రామాల్లో… నిరసనలు హోరెత్తాయి. పిల్లల నుంచి వృద్ధుల వరకూ అంతా భాగస్వాములయ్యారు. రోజుకోరూపంలో 96 రోజులపాటు శిబిరాల్లో నిరసన తెలిపారు. కరోనా కారణంగా ఇళ్ల వద్దే నిత్యం నినదిస్తున్నారు.

ఆర్నెళ్లకుపైగా సాగుతున్న పోరాటాన్ని అతివలే… అపరదుర్గలై నడిపిస్తున్నారు. ఇళ్లు చక్కబెట్టుకుంటూనే అమరావతి ఆశను. బతికించుకుంటున్నారు. దీక్షలు, ధర్నాలు, మౌన ప్రదర్శనలు, కాడగాల ర్యాలీలు, యజ్ఞాలు, ప్రధానికి లేఖలు, జాతీయ రహదారి దిగ్బంధం, అసెంబ్లీ ముట్టడి ఇలా అనేక పోరాటాల్లో కదం తొక్కారు. రోడ్లపై నిరసనలు కుదరవంటే….. ప్రైవేటు స్థలాల్లో టెంట్లు వేసుకుని కూర్చున్నారు. పాదయాత్రగా వెళ్లి కనకదుర్గమ్మకు మొక్కులూ తీర్చుకున్నారు. ఈ క్రమంలో లాఠీ దెబ్బలు తిన్నారు.

144 సెక్షన్‌ పేరిట కట్టడిచేసినా.. ఇళ్ల ముందు ఇనుప కంచెలు వేసినా.. తనిఖీల పేరుతో అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా పోలీసులు తలుపుతట్టినా బెదరలేదు. అహింసకు తావ్విలేదు. శాంతియుతంగానే..నిరసన కొనసాగిస్తున్నారు. ఈ రెండు వందల రోజుల్లో సుమారు 600 మంది రైతులు, రాజధాని గ్రామాల ప్రజలపై…… పోలీసులు వివిధ కేసులు పెట్టారు.

అమరావతి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు.. వివిధ వర్గాలతో అమరావతి పరిరక్షణ సమితి ఏర్పడింది. వివిధ పార్టీలు, ప్రజాసంఘాల మద్దతు కూడగట్టింది. వైకాపా మినహా.. అన్ని పార్టీలు, పలువురు పీఠాధిపతులు.. ఆధ్యాత్మిక, సినీ ప్రముఖులూ బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. విజయవాడ, గుంటూరుతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోనూ.. ప్రదర్శనలు నిర్వహించారు. మహిళలు, రైతులు నట్టింటికే పరితమవుతున్నారనుకుంటే… నెట్టింట్లోనూ అడుగుపెట్టారు. వెయ్యి మంది వరకూ ట్విటర్, ఫేస్‌బుక్‌ ఖాతాలు తెర్చిసామాజిక మాధ్యమాల్లోనూ ఉద్యమ వేడి రగిల్చారు. ఫలితంగా దేశవిదేశాల్లోని ప్రవాసాంధ్రులూ… రాజధాని రైతులకు సంఘీభావం తెలిపారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతులు, మహిళలు…. చివరకు న్యాయపోరాటం కూడా చేస్తున్నారు. రాజధాని గ్రామాల్లో… 144 సెక్షన్‌, మహిళలపై పోలీసుల దాష్టీకం, 3 రాజధానుల బిల్లులు, రాజధాని భూముుల్లో ఇళ్ల పట్టాల పంపిణీ వంటి… ప్రభుత్వ నిర్ణయాలపై న్యాయపోరాటంలో కొన్ని విజయాలు సాధించగా కొన్నింట్లో విచారణ జరగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This