ఇది 3డీ ఇల్లు… ధర తక్కువ… మన్నిక ఎక్కువ …

ఇళ్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నది ఒకప్పటి సామెత. రెండింటిలోనూ వ్యయప్రయాసలు ఉంటాయని దానర్థం. పెరుగుతున్న సిమెంట్​, ఇసుక ధరలతో సామాన్యుడికి సొంతిల్లు తీరని కలగానే మిగులుతోంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఒజాజ్​ అనే సంస్థ దేశంలో మొదటిసారి తక్కువ ధరలో… అతి తక్కువ సమయంలో 3డీ ఇంటి నిర్మాణాలు చేపడతామంటూ ముందుకొచ్చింది.

ఖర్చు తక్కువ… మన్నికెక్కువ…

రోబోటిక్​ త్రీడీ సాంకేతికత పరిజ్ఞానంతో వారం రోజుల్లో ఇళ్లు కట్టవచ్చు. దేశంలోనే మొట్టమొదటి త్రీడీ ప్రింటింగ్ ఇంటికి తెలంగాణ వేదికైంది. సిద్దిపేట జిల్లా బండమైలారంలో ఒజాజ్ అనే సంస్థ దేశంలోనే మొట్టమొదటి నమూనా ఇంటిని నిర్మించింది. సాంప్రదాయక నిర్మాణ వ్యయం కంటే దాదాపు 20 నుంచి 30శాతం తక్కువ ఖర్చుతో.. అనేక రెట్లు మన్నికగా నిర్మించడం దీని ప్రత్యేకత.

రష్యా నిపుణుల సహకారం…

సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండమైలారం శివారులో ఈ సాంకేతికతను ఉపయోగించి వంద చదరపు అడుగుల్లో నిర్మించిన గదిని శుక్రవారం మీడియా ముందు ప్రదర్శించారు. రష్యా నిపుణుల సహకారం తీసుకున్నట్లు చెప్పిన సంస్థ సీఈవో జాషువా ఇందులో వాడే ప్రతి విడిభాగాలను భారత్​లోనే తయారు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రత్యేకతలు…

  1. వారంలో ఇంటి నిర్మాణం పూర్తి
  2. నీటి వినియోగం తక్కువ, పర్యవరణహితం
  3. నిర్మాణానికి కార్మికులు అవసరం లేదు
  4. ఖర్చు సాధారణంతో పోలిస్తే 20 నుంచి 30 శాతం తక్కువ
  5. నచ్చిన ఆకృతిని కంప్యూటర్​లో డిజైన్​ చేసుకునే వెసులుబాటు
  6. వందేళ్ల మన్నిక

పిల్లర్లు లేని ఇళ్లు…

కేవలం ఐదు రోజుల్లో నిర్మాణమయ్యే ఈ ఇంటికి పిల్లర్లు కూడా లేవు.. మరి దృఢత్వం సంగతేంటి అని అందరికీ అనిపించొచ్చు. వందేళ్లకు పైగా మన్నికగా ఉండేందుకు ఇందులో సిమెంట్​తో పాటు స్టీల్​, గ్లాస్​ ఫైబర్లను వాడుతున్నట్లు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. మిశ్రమాన్ని కలిపేందుకు మాత్రమే నీటిని వినియోగిస్తామని.. తర్వాత నీటి అవసరమే ఉండదని జాషువా పేర్కొన్నారు.

ఈ పర్యావరణహిత ఇళ్లు మరో పదేళ్లలో ఓ విప్లవం సృష్టిస్తాయని ఒజాజ్​ సంస్థ నిర్వాహకులు అంటున్నారు. వీరి ప్రవేశపెట్టిన సాంకేతికతను చూస్తుంటే సామాన్యుని సొంతిటి కల ఎంతో దూరంలో లేదనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This