10 నిమిషాల ముందే చాయ్ తాగి..పేలుడులో మరణించాడు!

హైదరాబాద్: రాజేంద్రనగర్ పిల్లర్ నం.280 వద్ద జరిగిన రసాయన పేలుడు కలకలం సృష్టించింది. గణేశ్ నవరాత్రుల సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో పోలీసు వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది. పోలీసులు హూటాహుటిన పేలుడు జరిగిన ప్రాంతానికి తరలివెళ్లారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్, హైదరాబాద్ జాయింట్ సీపీ తరుణ్‌జోషి, కౌంటర్ ఇంటెలిజెన్స్, ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచి, ఆక్టోపస్ అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి పేలుడు విధానాన్ని పరిశీలించారు. ప్రాథమికంగా బాంబు పేలుడు కాదని నిర్ధారణకు వచ్చిన పోలీసు ఉన్నతాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పేలుడుకు రసాయనం కారణమని చెబుతున్నప్పటికీ ఆ రసాయనం పేరు స్పష్టంగా తెలియడం లేదు. అంతేకాకుండా అది పిల్లర్ నం.280 వద్దకు ఎలా వచ్చిందన్న దానిపై సైబరాబాద్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే రసాయన నమూనాలను సేకరించి వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. అక్కడి నుంచి నివేదిక వచ్చిన తర్వాతనే పేలుడుకు అసలు కారణం స్పష్టం కానున్నది. అప్రమత్తమైన పోలీసులు తప్పుడు ప్రచారం కాకుండా జాగ్రత్తలు తీసుకుని ప్రాథమికంగా బాంబు పేలుడు కాదని తేల్చేశారు. దీంతో సోషల్ మీడియాలో బాంబు పేలుడు అని వైరల్ కాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.

ఐద్వెత్త కెమికల్ కంపెనీకి సంబంధించిన రసాయనం అనుకున్నప్పటికీ పోలీసు అధికారులు మాత్రం ఇంకా పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నాం. ఆ రసాయనాన్ని అక్కడ ఎందుకు పడేశారు, ఎప్పుడు పడేశారు అనే కోణంలో సీసీ కెమెరాలతోపాటు ఘటన చోటుచేసుకున్న పరిసర ప్రాంతాల్లో ఉండే పారిశ్రామిక వాడలో ఎవరు ఈ తరహా రసాయనాన్ని వాడుతున్నారనే అంశంపై ఆరా తీస్తున్నారు. అసలు ఈ రసాయనాన్ని వాడుకోవడానికి అనుమతి ఉందా? లేదా నిషేధంలో ఉన్న వ్యవహారంపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. రసాయనం ఎక్కడి నుంచి వచ్చిందని తేలితే నిర్లక్ష్యంగా, ప్రమాద భరితంగా రోడ్డుపై పడేయడంపై పోలీసులు సంబంధిత వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. దీని కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి ప్రాథమిక విచారణలో సేకరించిన క్లూస్ ఆధారంగా దర్యాప్తును ముమ్మ రం చేశారు. ఈ ఘటనలో చిత్తు కాగితాలు ఏరుకొని భిక్షాటన చేసే అలీ మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రజలు ఈ వదంతులు నమ్మవద్దని సీపీ సజ్జనార్, శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఘటనా స్థలాన్ని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

10 నిమిషాల ముందు..

రసాయన పేలుడు ఘటనను ప్రాథమికంగా దర్యాప్తు చేసిన పోలీసులు దాదాపు 25 నుంచి 30 సీసీ కెమెరాలు తనిఖీ చేశారు. దీంట్లో ఘటనలో గాయపడి మృతి చెందిన అలీ అర గంట ముందు పిల్లర్ నంబర్.280 నుంచి ఓ కవర్ తీసుకుని వెళుతూ దానిని మధ్యలో పడేశాడు. ఆ తర్వాత మరో కవర్‌ను రోడ్డుపై నుంచి సేకరించుకుని వాటిని పరిశీలించి ఆ కవర్‌ను కూడా మధ్యలో పడేశాడు. కొద్ది దూరం వచ్చి ఓ టీ కొట్టు వద్ద చాయ్ తాగాడు. ఆ మరో కవర్‌ను సేకరించుకుని పిల్లర్ నంబర్.280 వద్దకు చేరుకున్నాడు. ఆ తర్వాత పేలుడు సంభవించిందని విచారణలో బయటపడింది. అలీ డబ్బాతో ఉన్న ప్లాస్టిక్ కవర్‌ను సేకరించిన ప్రాంతంలో పెయింట్ షాపులు, గ్రానైట్ షాపులు ఉన్నాయి. వాటి నుంచి ఎవరైనా ఈ రసాయనాన్ని పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రాథమికంగా పేలుడు ఆర్గానిక్ రసాయనం ద్వారా చోటుచేసుకుందని భావిస్తున్నారు. ఆర్గానిక్ రసాయనం అంటే వార్నిష్, టర్పాంటాయిల్, పెయింట్ కలిసి ఉండడంతో అది వత్తిడికి గురై పేలిందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This